సర్కారు  బడుల్లో ‘ప్రీ ప్రైమరీ’ ఇన్‌‌స్ట్రక్టర్ల నియామకం

సర్కారు  బడుల్లో ‘ప్రీ ప్రైమరీ’ ఇన్‌‌స్ట్రక్టర్ల నియామకం
  • కనీస అర్హత ఇంటర్.. స్పెషల్ డిప్లొమా చేసినోళ్లకు ఫస్ట్ చాన్స్
  • గైడ్‌‌లైన్స్‌‌ జారీ చేసిన విద్యాశాఖ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్ల (ఎల్ కేజీ, యూకేజీ)లో బోధించేందుకు ‘ప్రీ ప్రైమరీ ఇన్‌‌స్ట్రక్టర్ల’ నియామకానికి సంబంధించి విద్యాశాఖ గైడ్‌‌లైన్స్‌‌ జారీ చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస విద్యార్హతగా ఇంటర్మీడియెట్‌‌ను నిర్ణయించారు. అయితే, ఎర్లీ చైల్డ్‌‌హుడ్ ఎడ్యుకేషన్ లేదా ప్రైమరీ టీచింగ్‌‌లో క్వాలిఫికేషన్ ఉన్న వారికి నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని  స్పష్టం చేశారు.

ముఖ్యంగా డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్, నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్, రెండేండ్లకు తక్కువ కాకుండా ఉండే ఎర్లీ చైల్డ్‌‌హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్  పూర్తి చేసిన వారికి, అలాగే బీఈడీ (నర్సరీ) చేసిన అభ్యర్థులకు మొదటి చాన్స్ ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ నియామక ప్రక్రియపై తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, ఈ విద్యాసంవత్సరం కొత్తగా మరో 2,769 బడుల్లో ప్రీప్రైమరీ క్లాసులు ప్రారంభించనున్నట్టు ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.